దేశంలో డేంజర్ సిటీస్ ఇవేనట

వెటర్నరీ వైద్యురాలు దిశా ఉదంతంతో ఒక్కసారిగా హైదరాబాద్ మీద మరక లాంటి ఇమేజ్ పడింది. నిర్బయ ఉదంతాన్ని తలపించే రీతిలో సాగిన ఈ దారుణకాండ వేళ.. భాగ్యనగరి భద్రత మీదా.. మహిళల రక్షణ ఎంతన్న సందేహం పలువురు వ్యక్తం చేసే పరిస్థితి. ఇలాంటివేళ.. విడుదలైన ఒక నివేదిక ఆసక్తికరంగా మారింది.
సామాజిక సంస్థలు సేఫ్టీ పిన్.. కొరియా ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ.. ఆసియా ఫౌండేషన్ లు నిర్వహించిన అధ్యయన నివేదికల్ని తాజాగా బయటపెట్టారు. దేశంలో అపాయకరమైన నగరాలు.. మహిళలకు ఏ మాత్రం సురక్షితం కాని నగరాల జాబితా బయటకు వచ్చింది.

ఇంతకీ ఆ నగరాల జాబితాలో హైదరాబాద్ పేరు ఉందా? అన్న సందేహం కలుగక మానదు. అయితే.. ఈ అధ్యయనంలో అపాయకరమైన నగరాల్లో హైదరాబాద్ లేదు. మధ్యప్రదేశ్ లోని భోపాల్.. గ్వాలియర్.. రాజస్తాన్ లోని జోధ్ పూర్ నగరాలు ఏ మాత్రం సురక్షితం కాదని తేల్చారు.

ఎందుకిలా? అంటే.. ఆయా నగరాల్లో జనావాసం తక్కువగా ఉండటం.. ఇతర ప్రాంతాలకు ఇవి దూరంగా ఉండటం కారణంగా రక్షణ కరువైనట్లు చెబుతున్నారు. వీరు చేసిన అధ్యయనంలో ప్రపంచంలోని పలు నగరాల్లో డేంజర్ సిటీస్ గా భోపాల్ (77).. గ్వాలియర్ (75).. జోధ్ పూర్ (67) స్థానాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల్లో 57.1 శాతం.. అవివాహిత యువతుల్లో 50.1 శాతం లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లుగా పేర్కొన్నారు.

అపాయకరమైన నగరాల్లో డ్రగ్స్.. మద్యం అందుబాటులో ఉండటం.. ప్రజారవాణ అందుబాటులో లేకపోవటం.. సరైనభద్రతను కల్పించలేకపోవటం కూడా కారణంగా చెబుతున్నారు. మొత్తంగా ఈ అధ్యయనంలో హైదరాబాద్ నగరం లేకపోవటం.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నగరం లేకపోవటం ఉపశమనం కలిగించే అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *