ఏపీ శాసనమండలిలో టీడీపీ అస్త్రం రూల్ 71 తీర్మానం.. అంటే ఏమిటో తెలుసా?

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని శాసనసభలో బిల్లును ఆమోదించిన విషయం విదితమే. ఈ బిల్లును అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కాగా ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ఈ బిల్లును ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకోవాలని చూస్తోంది. దీని కోసం ఏపీ శాసనమండలిలో రూల్ 71 తీర్మానాన్ని

ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ఆమోదం పొందే వరకు ప్రభుత్వం ఆమోదించిన మూడు రాజధానుల బిల్లు ఇరుకున పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ ఈ రూల్ 71 తీర్మానం అంటే ఏమిటో తెలుసుకుందామా.

ప్రభుత్వంలో ఏదైనా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునేందుకు రూల్ 71 తీర్మానం వెసులుబాటు కలిగించింది. ఈ తీర్మానం ప్రకారం సభా కార్యకలాపాలు ప్రారంభించే ముందే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మండల కార్యదర్శికి సంబంధిత తీర్మానాన్ని నోటీసు రూపంలో లిఖిత పూర్వంగా అందజేయాల్సి ఉంటుంది.

ప్రవేశపెట్టిన తీర్మానం రూల్ 71కు అనుగుణంగా ఉందని మండలి చైర్మన్ భావిస్తే, సభలో దానిని చదివి వినిపించాల్సి ఉంటుంది. తీర్మానం నోటీసుకు అనుకూలంగా 20 లేక అంతకుమించి సభ్యులు ఉంటే దానిని చర్చకు స్వీకరిస్తారు.

ఈ రూల్‌ 71 తీర్మానాన్ని టీడీపీ మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు మండలిలో ప్రస్తావించాడు. ఒకవేళ ఈ తీర్మానాన్ని మండలి వ్యతిరేకిస్తే దానిని తిరిగి అసెంబ్లీకి పంపిస్తారు. రెండోసారి కూడా అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందితే మరోసారి తీర్మానాన్ని మండలిలో చర్చకు వెళుతోంది. ఇక్కడ మరోసారి దానిని వ్యతిరేకించినట్లయితే ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారు.

ఈ బిల్లును గవర్నర్ ఆమోదంతో చట్టంగా మార్చేందుకు వీలుంటుంది.

మరి జగన్ ప్రభుత్వం ఆమోదించిన బిల్లును టీడీపీ శాసనమండలిలో ప్రవేశపెట్టిన తరుణంలో ఎలాంటి చర్చ జరగనుందనే అంశం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బిల్లును వ్యతిరేకిస్తున్న టీడీపీ పట్ల వైసీపీ ఎలాంటి ఎత్తుగడతో ముందుకు వెళ్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *