మేఘా కృష్ణారెడ్డి ఊరికి పవన్‌ కళ్యాణ్‌…

కృష్ణా జిల్లా డోకిపర్రు మేఘా కృష్ణారెడ్డి స్వగ్రామం. మేఘా కృష్ణారెడ్డి సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడ్డాక తన స్వగ్రామం డోకిపర్రును ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశారు. రోడ్లు, మంచినీటి వసతి, గ్యాస్‌ సరఫరా తదితర అనేక సౌకర్యాలు ఆ గ్రామానికి కల్పించారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆ ఊరిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇప్పుడు ఆ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల నిర్వహణకోసం మేఘా కృష్ణారెడ్డి కుటుంబం ప్రస్తుతం అక్కడే ఉంటూ… ఆ కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఇది ఏటా జరిగేదే. అయితే ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం.

కృష్ణాజిల్లా డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు విచ్చేసిన పవన్‌ కళ్యాణ్‌ కు మేఘా కృష్ణారెడ్డి కుటుంబం స్వాగతం పలికింది.

ఇలా మేఘా కృష్ణారెడ్డి కట్టించిన ఆలయంలో పూజలకోసం పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్ నుంచి రావడంతో అనేక మంది ఊహాగానాలకు తెరతీస్తున్నారు. రాజకీయ కోణంలో కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు.

అయితే నిజానికి మేఘా కృష్ణారెడ్డి కుటుంబం, చిరంజీవి కుటుంబం 30 ఏళ్ళుగా స్నేహితులు, కుటుంబ మిత్రులు. చిరంజీవి ఇల్లు, మేఘా కృష్ణారెడ్డి ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. ఈ రెండు ఇళ్ళల్లో ఏ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా రెండో కుటుంబం హాజరవుతుంది. అంతటి సాన్నిహిత్యం ఉంది ఈ రెండు కుటుంబాల మధ్య.

బహుశా ఆయన ఆహ్వానం మేరకు పవన్‌ కళ్యాణ్‌ డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలకు ఈరోజు వచ్చి ఉండవచ్చు. ప్రతి ఏటా మేఘా కృష్ణారెడ్డి కుటుంబం తన గ్రామంలో తాము నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఈరోజు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రావడంతో ఆ ప్రాంత పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *