ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ వే క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు ఇవాళ ఇరిగేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. మే చివరి నాటికి గేట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుందని సీఈ బి.సుధాకర్ బాబు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే పనులు అన్నీ సక్రమంగా పూర్తి చేసి 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందన్నారు.
2022 ఖరీఫ్ నాటికి నీళ్ళు అందిస్తామని ఎస్ఈ ఎం.నాగిరెడ్డి అన్నారు. తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించి గెట్లకు సంబంధించి ఆర్మ్ గడ్డర్లు లిఫ్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు సీఈ బి.సుధాకర్ బాబు, ఎస్ఈ ఎం నాగిరెడ్డి, ఈఈ ఆదిరెడ్డి, డిఈ లు మెఘా ఇంజనీరింగ్ సంస్థ జీఎం సతీష్ బాబు, మేనేజర్ మురళి, బేకం కంపెనీ డైరెక్టర్ కాళీ ప్రసాద్‌లు పాల్గొన్నారు.