2 వేల కోట్ల నల్లధనం : టీడీపీ నేతల్లో గుబులు

ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించిన వివరాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఆదాయపు పన్ను శాఖ వెల్లడించిన వివరాల్లో అత్యంత కీలకమైన విషయమేమంటే… ఒక ప్రముఖ వ్యక్తి వద్ద పీఎస్‌ గా పనిచేసిన వ్యక్తి నుంచి కీలకమైన పత్రాలు అనేక ఆధారాలు లభ్యమైనట్టు పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేకచోట్ల అనేక చోట్ల పలువురు వ్యక్తులు ఇన్ ఫ్రా సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మూడు ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పీఏగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో కూడా ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

గడిచిన ఆరు రోజులుగా జరుపుతున్న సోదాల్లో భాగంగా బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, తప్పుడు బిల్లులతో అక్రమార్కులు భారీ కుంభకోణాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్‌ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించిన ఐటీ శాఖ… ప్రాథమిక అంచనాల ప్రకారం 2000 వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అంచనా వేసింది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ- మెయిల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతో పాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *