8 ఏళ్లలో ఇచ్చిన నిధులు రూ.11,182 కోట్లు మాత్రమేనని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయినిగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన చేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌​ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్‌ గురువారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. 8 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చింది రూ.11,182 కోట్లు అని ప్రకటించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన దరిమిలా 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రం రూ.11,182 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రాజెక్ట్‌లోని ఇరిగేషన్‌ పనులకు మాత్రమే ఈ నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునఃనిర్మాణం పనులతోపాటు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మొత్తం రూ.55,657 కోట్లు ఖర్చవుతుందని సవరించిన అంచనాలు చెబుతుంటే 8 ఏళ్ల వ్యవధిలో కేంద్రం ఇచ్చింది కేవలం రూ.11,182 కోట్లు మాత్రమేనని మంత్రి తెలిపిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో అమలుచేస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల వివరాలను కూడా మంత్రి రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ సవివరంగా తన జవాబులో తెలిపారు.

ఏప్రిల్‌ 2018 నుంచి మార్చి 2019 వరకు రాష్ట్రంలో 88 కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల అమలు కోసం రూ.10,632 కోట్లు విడుదల
ఏప్రిల్‌ 2019 నుంచి మార్చి 2020 వరకు రాష్ట్రంలో 84 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు రూ.11,112 కోట్లు విడుదల
ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2021 వరకు 79 కేంద్ర పథకాల అమలు నిమిత్తం రూ.12,904 కోట్లు విడుదల
ఏప్రిల్‌ 2021 నుంచి జూలై 2021 వరకు రాష్ట్రంలో అమలుచేస్తున్న 31 కేంద్ర పథకాల కోసం రూ.1,794 కోట్లు విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *